అతను ఓ పడవ సరంగు
ఆ గట్టు మీద తాతల నాటి ఇల్లు
ఈ గట్టు మీద నాలుగు గిన్నెలు
పైకప్పు లేని చెట్టు కింద.....
ఎందుకో
ఖాళీ పడవతో ఆ గట్టు ..ఈ గట్టు
పలుమార్లు పయనిస్తాడు..
ఎందరో వెర్రివాడు అన్నారు
తెలియనితనం అన్నారు
తెలివితక్కువతనం అన్నారు
చివరన సన్యాసి లాటోడన్నారు...
గట్టు గట్టుకి మాట మారుస్తాడు
ఒకసారి నాలో నన్ను వెతుక్కుంటానంటాడు
మరోసారి నా నుంచి నేను విడిపోయానంటాడు
కొంతకాలానికి
పడవ మాయమయ్యిందన్నాడు
కానీ గట్టుపయనం మానలేదు
నదిలోని చేపపిల్ల అయ్యాడిపుడు....
ఎప్పుడో
వీడు మాయం అవుతాడు
ఇతన్ని పోగొట్టుకుంటాము
ఎక్కడో అంతు పట్టకుండా.....
అప్పుడు .. అందరూ
కథలు కథలుగా చెప్పుకుంటారు
ఒకానొక
సమయాన అంటూ ...
ఇంతకూ
అది సరంగు కథగా
మొదలవుతుందా......